CoronaVirus: ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభవార్త

16 May, 2021 02:33 IST|Sakshi

హోం ఐసోలేషన్‌లో ఉచిత కాన్సంట్రేటర్లు 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభవార్త చెప్పారు. ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల కోసం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల బ్యాంక్‌ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1031 కి ఫోన్‌చేస్తే కేవలం 2గంటల్లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ గుమ్మం ముందు ఉంటుందని అన్నారు. ఈ సేవను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో 200 కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఒకరి వద్ద అవసరం తీరిపోయాక, ఆ కాన్సంట్రేటర్‌ను శానిటైజ్‌ చేసి అవసరంలో ఉన్న మరొకరికి ఇస్తామని చెప్పారు. డాక్టర్ల సిఫారసు మేరకు అవసరమైన పేషెంట్లకు వీటిని అందివ్వనున్నారు. ఓ టెక్నీషియన్‌ వచ్చి ఎలా వాడాలో వివరిస్తారని తెలిపారు. హోం ఐసోలేషన్‌ ప్రొటోకాల్‌కు ఎన్‌రోల్‌ చేసుకోని వారు కూడా 1031కి ఫోన్‌ చేసి కాన్సన్ట్రేటర్‌ తెప్పించుకోవచ్చన్నారు. సరైన సమయంలో ఆక్సిజన్‌ అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టుకోవచ్చన్నారు. వీటిని స్పాన్సర్‌ చేసిన ఓఎల్‌ఏ ఫౌండేషన్, గివ్‌ఇండియా సంస్థలను అభినందించారు.    

మరిన్ని వార్తలు