మా తర్వాతి టార్గెట్‌ ఆ రాష్ట్రమే.. కేజ్రీవాల్‌ కీలక ప్రకటన

21 Apr, 2022 20:08 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఇటీవల పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో ఆప్‌ సర్కార్‌ పాలన కొనసాగిస్తోంది. కాగా, పంజాబ్‌లో గెలుపుతో అదే జోరుతో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫోకస్‌ పెట్టారు.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో పర్యటించి.. ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఒక‍్క ఛాన్స్‌ ఇవ్వాలని గుజరాతీలను కోరారు. అవకాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్‌ పాలనను అందిస్తామని స్సషం చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం కేజ్రీవాల్ గురువారం బెంగ‌ళూరులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఢిల్లీ, పంజాబ్‌లో ప్ర‌భుత్వాన్ని నెల‌కోల్పామ‌ని, ఇక త‌మ దృష్టి అంతా క‌ర్నాట‌క‌పైనే ఉందన్నారు. క‌ర్నాట‌క‌లో కూడా ఆప్ ప్ర‌భుత్వాన్ని నెల‌కోల్పుతామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్‌ చేశారు.

కేంద్రానికి కూడా రావ‌ణుడి లాగే అహంకారం ఉందన్నారు. సాగు చట్టాల విషయంలో తాము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. చివ‌రికి సాగు చ‌ట్టాను వెన‌క్కి తీసుకుంద‌ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఈ సందర్బంలోనే కర్నాటకలో పాఠ‌శాల‌లు, వైద్య‌శాల‌లు కావాలంటే ఆప్‌కు ఓటు వేయాలని కన్నడిలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, నేర‌స్థులే తిరిగి అధికారంలోకి రావాల‌ని కోరుకుంటే బీజేపీకి ఓటు వేయాలని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఇది చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్‌ నేత

మరిన్ని వార్తలు