ఢిల్లీలో బాణాసంచాకు నో ఛాన్స్‌

16 Sep, 2021 06:37 IST|Sakshi

దేశ రాజధానిలో వరుసగా మూడో ఏడాది దీపావళికి నిషేధం అమలు 

వాయుకాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం    

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలోని బాణాసంచా వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, ఈ ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వ్యాపారులు బాణాసంచాను నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించామని, ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందని కేజ్రీవాల్‌ తన ట్వీట్‌లో వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ముందుగానే ప్రకటించినందున వ్యాపారులందరూ ఎలాంటి బాణాసంచాను నిల్వ చేయరాదని ఆయన కోరారు.  

రూ.1,500 కోట్ల బాణాసంచా వ్యాపారం
మరోవైపు దీపావళి రోజున దేశ రాజధానిలో సుమారు రూ.1,500 కోట్లకు పైగా బాణాసంచా వ్యాపారానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బ తగిలినటైంది. ఢిల్లీలో 150 కి పైగా హోల్‌సేల్‌ బాణాసంచా విక్రేతలు ఉన్నారు. వీరేగాక దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఢిల్లీలో బాణాసంచా విక్రేతలు తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారం చేస్తారు.   

మరిన్ని వార్తలు