ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్‌ సర్కార్‌

2 Sep, 2022 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘మిగతా రాష్ట్రాల్లో సఫలమైన బీజేపీ ఆపరేషన్‌ కమలం ఢిల్లీలో పూర్తిగా విఫలమైంది. ఒక్క ఆప్‌ ఎమ్మెల్యేను కూడా లాగలేకపోయింది’’ అని ఆప్‌ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గురువారం ఆప్‌ సర్కార్‌ విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విశ్వాసపాత్రులని చాటి చెప్పేందుకే విశ్వాస పరీక్ష పెట్టామన్నారు.

గుజరాత్‌లో ఆప్‌ ఓటు శాతం పెరిగింది
గుజరాత్‌లో ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై సీబీఐ అక్రమ దాడుల తర్వాత అక్కడ ఆప్‌ ఓటు షేరు నాలుగు శాతం పెరిగిందన్నారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్‌చేస్తే మరో రెండు శాతం ఓటు శాతం ఎగబాకుతుందన్నారు. ‘‘సిసోడియా సొంతూర్లోనూ సోదాలు చేశారు. బ్యాంక్‌ లాకర్‌ తెరిపించారు. అయినా ఏమీ దొరకలేదు. ఈ దాడుల ద్వారా ఆప్‌కు, సిసోడియా నిజాయతీకి ప్రధాని మోదీనే స్వయంగా నిజాయతీ సర్టిఫికెట్‌ ఇచ్చేశారు’’ అన్నారు. మరోవైపు ఢిల్లీలో మళ్లీ పాత మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ చైర్మన్‌గా తాను పాల్పడిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలన్న ఆప్‌ ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మండిపడ్డారు. 

చదవండి: శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్‌ మంత్రి రాజీనామా

మరిన్ని వార్తలు