అలా అంటుంటే చాలా బాధపడ్డాను: అరవింద్‌ కేజ్రీవాల్‌

25 Oct, 2022 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొంతమంది రాజకీయ నాయకులు ఉచిత విద్యావిధానం విషయంలో చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానన్నారు. తాను ప్రతి ఒక్క భారతీయుడు చదువుకునేలా... ఉచితంగా మంచి విద్యనభ్యసించాలని ఆకాంక్షించానన్నారు. కానీ భారత్‌లో ఉన్న రాజకీయ నాయకులు వీటిని ఉచిత రేవడి లేదా ఉచిత స్కీంల ఎర వంటివిగా  అభివర్ణించారని చెప్పారు. డెన్మార్క్‌ వంటి దేశాలు ఉచిత విద్యా విధానంతో ధనిక దేశాలుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

ఈ మేరకు కేజ్రీవాల్‌ 2017లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ...."డెన్మార్క్‌ తమ దేశంలోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉండనట్లయితే వారి నెలవారి ఖర్చుల నిమిత్తం దాదాపు రూ. 82 వేలు అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే వారి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ విధానంతో విద్యార్థులకు మంచి విద్యను పొందే అవకాశాన్ని మాత్రం ఇస్తున్నాయి అని" అన్నారు.

తాను కూడా ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చానన్నారు. ప్రతి భారతీయుడు ధనవంతుడు కావాలంటే ప్రతి ఒక్క చిన్నారికి ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని అన్నారు. వాస్తవానికి కేజ్రీవాల్‌ మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను టార్గెట్‌ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీది ఉచితంగా ఇస్తానని చెప్పకూడదని, రాజకీయ సంస్కృతిలో ఈ ఉచిత రేవడిలు ఒక ఎత్తుగడ వంటివని విమర్శించిన సంగతి తెలిసిందే.

(చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్‌ సీఎం.. ఎందుకంటే?)

మరిన్ని వార్తలు