'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్‌ కేజ్రీవాల్‌

14 Nov, 2022 17:24 IST|Sakshi

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌ ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి, ఆప్‌కి మధ్య ప్రత్యక్ష పోటీ జరుగుతోందన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కేవలం నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు.

గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని, ఈసారి ఆప్‌ కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తుందని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్‌ తన ప్రాబల్యం కోల్పోతుందంటూ పదేపదే చెప్పి తమ పార్టీ ఆధిక్యతను ప్రచారం చేసే పనిలో పడ్డారు కేజ్రీవాల్‌. ఆప్‌ ఇప్పటికే గుజరాత్‌లో 178 స్థానాల్లో తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం 13 శాతానికి పడిపోతుందని, అందువల్ల కాంగ్రెస్‌ ఓటు వేయాలనుకుంటున్న ఓటర్లంతా ఇలా చేసి మీ ఓటును వృధా చేయొద్దు.

మీ కుటుంబానికి, పిల్లలకు మంచి భరోసా ఇచ్చే ఆప్‌కే ఓటు వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాదు బీజేపీతో విసుగు చెంది ఉన్న ప్రజలు కాంగ్రెస్‌పై ద్వేషంతో నిస్సహాయతతో అధికార పార్టీకి ఓటు వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు బరిలోకి దిగుతున్న ఆప్‌పై ప్రజల్లో కొత్త ఆశ చిగురించి తమకు ఓటు వేస్తారని, అలాగే కాంగ్రెస్‌ ఓట్లు కూడా తమకే పడతాయని ధీమాగా చెప్పారు. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

(చదవండి: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి...మొండి చేయి చూపిన బీజేపీ)

మరిన్ని వార్తలు