ప్రతి రోజు 100 మందికి కోవిడ్‌ టీకా

14 Jan, 2021 14:01 IST|Sakshi

వారానికి నాలుగు రోజులు.. 81 కేంద్రాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కోవిడ్‌ టీకా డ్రైవ్‌ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. వారానికి నాలుగు రోజులు- సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం వ్యాక్సిన్‌లు వేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "జనవరి 16న ఢిల్లీలోని 81 ప్రాంతాల్లో టీకాలు వేయడం జరుగుతుంది. ఈ కేంద్రాల్లో రోజుకు 100 మంది చొప్పున.. వారానికి నాలుగు రోజులలో టీకాలు వేయడం జరుగుతుంది" అన్నారు. (చదవండి: కోవాగ్జిన్‌కు డిక్లరేషన్‌ మస్ట్‌..)

"ఇప్పటివరకు, కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,74,000 డోసుల వ్యాక్సిన్‌లు వచ్చాయి. ఇక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని కేం‍ద్రం మరో 10 శాతం వ్యాక్సిన్‌లని అదనంగా ఇస్తుంది. ఇక ప్రతి వ్యక్తికి రెండు డోసులు ఇస్తాము. ప్రస్తుతం 1,20,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌లు ఇవ్వనున్నాం. అందువల్ల 2,74,000 డోసులు సరిపోతాయి’ అన్నారు. త్వరలో ఢిల్లీలో వ్యాక్సిన్‌ కేంద్రాల సంఖ్యను 1,000కి పెంచుతామన్నారు. ‘తొలుత 81 కేంద్రాలతో ప్రారంభించాము. మరికొద్ది రోజుల్లో వాటిని 175కి.. ఆ తర్వాత ఢిల్లీ అంతటా 1,000 కేంద్రాలకు పెంచుతాం’ అన్నారు. 
 

మరిన్ని వార్తలు