క్షణాల్లో కరోనాను గుర్తించే యాప్‌

23 Jul, 2020 21:20 IST|Sakshi

ఢిల్లీ : ఆర్కే పురం డీపీఎస్‌లో విద్యను అభ్యసిస్తున్న 17 ఏళ్ల ఢిల్లీకి చెందిన ఆర్యన్‌ గులాటి కోవిడ్‌-19తోపాటూ ఊపిరితిత్తుల సమస్యలను సులభంగా గుర్తించే వెబ్‌ ఆధారిత యాప్‌ ‘లంగ్‌ఏఐ’ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యాప్‌తో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ ఐడియాథాన్‌లో సత్తాచాటిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 3 నుంచి 5 సెకన్ల వ్యవధిలో ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలను లంగ్‌ఏఐ యాప్‌ గుర్తించగలుగుతుంది.(‘అమెరికా ల్యాబ్‌లో తేల్చుకుందాం’)

ఆత్మనిర్భర భారత్‌ ఐడియాథాన్‌లో సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఆర్యన్ గులాటి విజేతగా నిలిచాడు. అతను తయారు చేసిన వెబ్-ఆధారిత అప్లికేషన్ లంగ్‌ఏఐతో కోవిడ్-19, ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యుమోనియా, క్షయలతో పాటూ వివిధ రకాల ఊపిరితిత్తుల సమస్యలను సులభంగా గుర్తించవచ్చు. ఐడియాథాన్‌లోని ఐదు విభాగాలలో ఐదుగురు విజేతల్లో ఆర్యన్ అతి పిన్నవయస్కుడు. జాతీయ స్థాయిలో లంగ్‌ఏఐ యాప్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలను ఆర్యన్‌కు ప్రోత్సాహకంగా అందించింది. (మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రికి సోకిన క‌రోనా)

లంగ్‌ఏఐ ఎలా పనిచేస్తుందంటే..
మీరు చేయవలసిందల్లా లంగ్‌ఏఐ వెబ్‌సైట్‌లో ఛాతీ ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం కేవలం 3 నుండి 5 సెకన్లలోపు ఫలితాన్ని పొందుతారు. వెబ్‌సైట్ 90శాతానికి పైగా ఖచ్చితత్వ రేటింగ్‌ను కలిగి ఉంది. వెబ్‌సైట్‌లోని ఆటోమేటిక్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా మీరు లంగ్‌ఏఐ ఫలితాన్ని వివిధ వైద్యులు, ఆసుపత్రులకు పంపవచ్చు. రిపోర్టులో కోవిడ్- 19 పాజిటివ్‌గా తేలినట్టయితే, వెబ్‌సైట్‌లోనే చికిత్సా సమాచారంతోపాటూ సమీప ఆసుపత్రుల వివరాలు బాధితుడికి అందుబాటులో ఉంటాయి.

‘కరోనా పరీక్షలను వేగంగా, ఖచ్చితంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా పద్ధతుల మాదిరిగా కాకుండా రోగులతో ముఖాముఖిలేకుండానే గుర్తించే ప్రక్రియను కనుగొనాలని అనుకున్నాను’ అని ఆర్యన్‌ అన్నారు. లంగ్‌ఏఐ అప్లికేషన్ ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో లేనప్పటికీ, మరింత విశ్లేషణ, తదుపరి పరీక్షల కోసం ఐసీఎమ్‌ఆర్‌తో ఆర్యన్ చర్చలు జరుపుతున్నాడు.

మరిన్ని వార్తలు