అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు.. అమిత్‌ షాకు ఒవైసీ కౌంటర్‌

26 Nov, 2022 16:24 IST|Sakshi

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్‌ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్‌ షా.. 2002 గుజరాత్‌లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు.

కాగా, అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై కౌంటర్‌ అటాక్‌ చేశారు. కాగా, ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా మీరు చెప్పిన ఎన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ, బిల్కిస్‌ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో అధికార బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు. ఏదో ఒకరోజు అధికారం మారుతుంది. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్‌ షా ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. తొలిసారిగా గుజరాత్‌ ఎన్నికల బరిలోకి ఎంఐఎం పార్టీ దిగుతోంది. తమ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు