అయోధ్యలో భూమి పూజ: ఒవైసీ వ్యాఖ్యలు

5 Aug, 2020 13:01 IST|Sakshi
ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకు పోదని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న వేళ మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది కూడా’’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఒవైసీ గతంలో ప్రధాని మోదీని విమర్శించిన విషయం తెలిసిందే.

అదే విధంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న ఓ క్రిమినల్స్‌ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ తాను బతికున్నంత కాలం బాబ్రీ మసీదు ఎపిసోడ్‌ ముగిసిపోదని హెచ్చరించారు. రామ మందిర భూమి పూజ నిర్వహించకూడదని విజ్ఞప్తి చేశారు.(లైవ్‌ అప్‌డేట్స్‌; అయోధ్యలో భూమిపూజ)

కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు స్థలం కేటాయించింది. ఇక బుధవారం హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణానికి సంబంధించిన తొలి అడుగు పడుతున్న నేపథ్యంలో అయోధ్య రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలుత రామజన్మ భూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకుని.. భూమి పూజ కార్యక్రంలో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా