సీన్‌ రీక్రియేషన్‌.. లఖీమ్‌పూర్‌కు ఆశిష్‌ మిశ్రా

15 Oct, 2021 04:47 IST|Sakshi
లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనను రీక్రియేట్‌ చేస్తున్న ‘సిట్‌’ అధికారులు

మరో ముగ్గురు నిందితులు కూడా..

దుర్ఘటన, హింసాకాండ జరిగిన తీరుపై ‘సిట్‌’ విచారణ

అఖీమ్‌పూర్‌ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్‌పూర్‌లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్‌ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్‌ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు.

అక్టోబర్‌ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్‌పూర్‌కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్‌పూర్‌ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్‌ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు