మోకరిల్లి మరీ క్షమాపణ చెప్పిన మోదీ...రాజస్తాన్‌ సీఎం ఫైర్‌

1 Oct, 2022 19:25 IST|Sakshi

జైపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. మీరు నాకంటే గౌరవప్రదమైన వ్యక్తిగా చూపించుకోవాలనే ఇలా చేశారా అంటూ మండిపడ్డారు. ఐతే ప్రధాని నరేంద్ర మోదీ శక్రవారం రాజస్తాన్‌లో సిరోహి జిల్లాలోని అబురోడ్‌ వద్ద జరగాల్సిన ర్యాలీ సభా వేదికకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన ఆలస్యంగా రావడంతో ఆ సభలో ప్రసంగించలేకపోయారు. అందుకని మోదీ మోకరిల్లి మరీ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మోదీపై అశోక్‌ గెహ్లాట్‌ తన అక్కసు వెళ్లగక్కారు. తనకంటే వినయ వంతుడనని ప్రజల్లో మార్కులు కొట్టేయాలని ఇలా చేశారా అం‍టూ విమర్శించారు. అయినా ఆ సభలో ఇలా పాతకాలం నాటి ‘ఫోజులు’ ప్రదర్శించకుండా ప్రజలకు సోదరభావం, ప్రేమ గురించి చక్కటి సందేశం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే తానే స్వయంగా ఫోన్‌ చేసి అభినందించేవాడినని అన్నారు.

కానీ ఆయన తన సలహాలను పాటించరని, పైగా మోదీ ఇలా మూడుసార్లు మోకరిల్లడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు. అదీగాక రాజస్తాన్‌లోని ప్రజలకు అశోక్‌ గెహ్లాట్‌ అంటే చాలా గౌరప్రదమైన వ్యక్తిగా, సాదాసీదాగా ఉండే వ్యక్తి అని తెలుసు. చిన్న‍ప్పటీ నుంచి తనకు ప్రజల్లో ఇలాంటి ఇమేజే ఉందని, అందువల్ల మోదీ ఇక్కడ ఎలా పోటీ చేయగలరు అని ప్రశ్నించారు. బహుశా అందుకోసమే అనుకుంటా నాకంటే నమ్రతగా ఉండే వ్యక్తిగా పేరుతెచ్చుకునేందుకే ఇలా మోకరిల్లారు కాబోలు అని ఎద్దేవా చేశారు. 

(చదవండి: రాజస్తాన్‌ సీఎంగా ఆయనే.. సచిన్‌ పైలెట్‌కు కీలక పదవి)

మరిన్ని వార్తలు