భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు

12 Feb, 2021 19:17 IST|Sakshi

దేశ‌భ‌క్తి ఎవ‌రికుందో ప్ర‌జ‌ల‌కు తెలుసు

రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌

న్యూఢిల్లీ: చైనాకు భారత భూభాగాలు అప్పగించారని.. లేదు అంగుళం ఇవ్వడం లేదని అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. చైనాకు భారత భూభాగాలు ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. చైనా ప్ర‌వేశించిన డెప్సాంగ్ మైదానాల‌పై రాజ్‌నాథ్ సింగ్ ఎందుకు మాట్లాడ‌లేద‌ని నిలదీశారు. ప్ర‌ధాని మోదీ భార‌త సైన్యం త్యాగాల‌ను ప‌క్క‌న‌పెట్టి, ద్రోహం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేయగా దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు బదులిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.

చైనాకు భార‌త భూభాగాన్ని ఎవ‌రు అప్ప‌గించార‌నేది మీ ముత్తాత‌ను‌ (జవహర్‌ లాల్‌ నెహ్రూ)ను అడగాలని కిషన్‌ రెడ్డి సూచించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త భూగాన్ని చైనాకు అప్ప‌గించార‌నే రాహుల్ వ్యాఖ్య‌ల‌పై ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు. చైనాకు భార‌త భూభాగాన్ని ఎవ‌రు అప్ప‌గించార‌నేది మీ ముత్తాత‌ను‌ అడిగితే స‌మాధానం త‌ప్ప‌కుండా తెలుస్తుంద‌ని పేర్కొన్నారు. దేశ‌భ‌క్తి ఎవ‌రికి ఉందో.. ఎవ‌రికి లేదో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. భారతదేశ భూభాగం ఎవరి హయాంలో అక్రమణకు గురైందో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
 


ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం
 

మరిన్ని వార్తలు