పీకలదాక మెక్కారు.. బిల్లు కట్టమంటే తప్పుడు కేసులు

24 Mar, 2021 10:25 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌ ధాబా ఓనర్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన

బాధ్యులను సస్పెండ్‌ చేసిన అధికారులు

లక్నో: కొన్ని పాత సినిమాల్లో పోలీసులు హోటల్‌కు వెళ్లడం.. బాగా తినడం.. బిల్లు కట్టమంటే.. ‘నా దగ్గరే డబ్బులడుగుతావా.. జైలుకెళ్తావా ఏంటి’ అంటూ బెదిరించే సీన్లు చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్‌, అతడి కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్‌, మద్యం అక్రమ రవాణ చేస్తున్నారంటూ కేసులు పెట్టారు పోలీసులు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేశారు.

ఆ వివరాలు..  ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో బాధితుడు ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ బాధితుడి ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.. పూర్తి బిల్లు చెల్లించమని కోరితే.. ధాబా సిబ్బందిని తిడుతూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత పోలీసులు రెండు జీపుల్లో ఆ ధాబా వద్దకు వచ్చి.. అక్కడ పని చేస్తున్న 9 మందిని జైలుకు తీసుకెళ్లారు. వీరంతా మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. అందుకే అరెస్ట్‌ చేశామని తెలిపారు. అంతేకాక నిందితుల వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

                                                             (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ) 

ఈ క్రమంలో సదరు ధాబా ఓనర్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో బిల్లు కట్టమని అడిగినందుకు అధికారులు మాపై కక్ష్య కట్టారు. కావాలనే మా మీద అక్రమ కేసులు పెట్టారు. తాగి వచ్చి నా సోదరుడు, సిబ్బందిపై దాడి చేశారు. మా దగ్గర తుపాకులు, గంజాయి దొరికిందని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఒక్కరిని విడిచిపెట్టారు’’ అని తెలిపారు. ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేశారు. విచారణకు ఆదేశించాము అని తెలిపారు.

చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో

మరిన్ని వార్తలు