వీడియో: తాగిన మత్తులో రెచ్చిపోయిన ఏఎస్పీ.. మహిళతో ఇలాగేనా ప్రవర్తించేది?

16 Sep, 2022 09:22 IST|Sakshi

మద్యం మత్తులో ఓ జిల్లా పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయాడు. బలవంతంగా యువతిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమిటని ప్రశ్నించిన మహిళలు, పాత్రికేయులపై దాడికి దిగాడు. అడ్డు చెప్పబోయిన సిబ్బందిపైనా లింగ వివక్షతో దూషణలకు దిగాడు. ఉదయమే అనారోగ్యంతో బాధ పడుతున్నానని మొసలి కన్నీరు కార్చుతూ ఆస్పత్రిలో చేరాడు. ఒడిషాలోని నవరంగపూర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. బరగఢ్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా జీవిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు.. అక్కడి ఏఎస్పీ జయకృష్ణ బెహరాను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆయన యువతి ఉన్న ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం కనుగొని, బలవంతంగా తన వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. 

దీంతో ఆమె పెద్ద ఎత్తున ఆర్తనాదానాలు చేయడంతో సమీపంలో ఉన్న పాత్రకేయులు దృశ్యాలను రికార్డింగ్‌ చేయడం ప్రారంభించారు. గమనించిన ఏఎస్పీ.. ఆగ్రహంతో ఊగిపోయారు. లాఠీలతో పాత్రికేయులపై దాడి చేశారు. అడ్డుకొన్న సమీపంలోని మహిళలను కూడా చితకబాదారు. వారించిన సిబ్బందిని సైతం రాయలేని భాషలో దూషించారు. ఏఎస్పీ దగ్గర నుంచి మద్యం వాసన రావడంతో అడ్డుకోవడానికి వచ్చిన స్థానిక మహిళలు సైతం దూరంగా జరిగారు. అనంతరం బాధిత మహిళను రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. వెంటనే పాత్రికేయులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని, ఆందోళనకు దిగారు. విషయం తెలుకున్న కలెక్టర్‌ భాస్కర్‌ రైతా ఘటనా స్థలానికి చేరుకుని, పాత్రికేయలతో చర్చలు జరిపారు. 

దర్యాప్తుకు కొరాపుట్‌ ఎస్పీ ఆదేశాలు 
బాధిత యువతితో పాటు అడ్డుకోవాడనికి వెళ్లిన మహిళల శరీర భాగాలను తాకుతూ ఏఎస్పీ జయకృష్ణ బెహరా వీరంగం సృష్టించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నవరంగపూర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠీ గురువారం ఉదయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తక్షణమే ఏఎస్పీని విధుల నుంచి తొలగించి, చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం పార్టీ జిలా అధ్యక్షురాలు షర్మిష్టా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళను అగౌరవంగా పరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యం కారణంతో ఏఎస్పీ జయకృష్ణ గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బాధిత మహిళను పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్‌ జిల్లా ఎస్పీ వరుణ్‌ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ బ్రహ్మ దర్యప్తు  ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు