భార్యపై ఆరోపణలు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: అస్సాం సీఎం

14 Sep, 2023 20:18 IST|Sakshi

గువాహతి: తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు  ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్‌ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

‘నా భార్య కానీ, ఆమెతో అనుబంధం ఉన్న కంపెనీకి  కేంద్ర  ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు పొందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలను చూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా ఏ శిక్షనైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా ట్వీట్‌ చేశారు. 

అయితే లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్‌ గొగోయ్‌, హిమంత బిస్వాశర్మ మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. అస్సాం బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్  ఇచ్చిన సమాధానాన్ని  గొగోయ్‌  ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం మొదలైంది.

ముఖ్యమంత్రి శర్మ తన పరపతిని ఉపయోగించి ఆయన భార్య నడుపుతున్న సంస్థకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కింద రూ.10 కోట్లు ఇప్పించారంటూ గొగోయ్ సంచలన ఆరోపణ చేయడంతో ఈ ఇద్దరు అసోం నేతల మధ్య వివాదం రాజుకుంది. పీఎం కిసాన్‌ యోజన కింద అస్సాం సీఎం భార్యకు రూ.10 కోట్ల రాయితీ అందినట్లు గొగోయ్‌ ఆరోపణలు చేశారు.సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్‌ శర్మకు చెందిన ‘ప్రైడ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు తెలిపారు. 

ఈ క్రమంలో  దయచేసి అస్సాం అసెంబ్లీకి హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని గొగోయ్‌ కోరారు. KMSY గురించి చర్చించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాన్ని సమర్పించారని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు.  గొగోయ్ ఆరోపణలను శర్మ ఖండించారు.  ఏం చేయాలో తనకు ఉపన్యాయం ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై అసెంబ్లీకి, న్యాయస్థానానికి వెళ్లాలో తానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

శర్మ ట్వీట్‌కు గొగోయ్ వెంటనే స్పందించారు. ''మరీ అంత ఉద్రేకం తెచ్చుకోకండి. అసెంబ్లీకి మీరు రావాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను మీకు పంపుతున్నాను. కోర్టుకు మీరు వెళ్తే నేను సంతోషిస్తాను. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తాయి'' అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు.

దీనిపై హిమంత శర్మ స్పందిస్తూ.. "అవును, నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. 2010 నుంచి మీ కుటుంబంపై అనేక కారణాల వల్ల ఆగ్రహంతో ఉన్నాను. మనం కోర్టులోనే మరోసారి కలవబోతున్నాం. నా వాదనను నేను నిరూపించుకుంటాను. 2016, 2021లో కూడా విజయవంతంగా నా వాదన వినిపించాను. మరోసారి అదే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇద్దరం ఇటు ప్రజాకోర్టులోనూ, అటు న్యాయస్థానంలోనూ కలుద్దాం'' అని శర్మ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేస్తున్నారా? గోయల్ శర్మ తన భార్యకు మంజూరు చేయడాన్ని ఆమోదించారు. కానీ నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇంకా ఎంత మంది బీజేపీ రాజకీయ నాయకులు తమ కుటుంబాలను సుసంపన్నం చేసేందుకు పీఎంకేఎస్‌వై పథకాన్ని ఉపయోగించుకున్నారు? అని గౌరవ్ గొగోయ్ అన్నారు.


వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.

మరిన్ని వార్తలు