బైక్‌పై తిరుగుతూ వరద ప్రభావంపై సీఎం ఆరా.. వీడియో వైరల్‌

14 Jul, 2022 17:16 IST|Sakshi

డిస్పూర్‌: దేశంలో భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు నీటమునిగాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు అస‍్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తముల‍్పూర్‌ జిల్లా సందర్శనకు వెళ్లిన క్రమంలో బైక్‌పై చక్కర్లు కొట్టారు. పింక్‌ రంగు హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలోని బగరిబారి ప్రాంతంలో బైక్‌ రైడ్‌ చేశానంటూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ చేశారు సీఎం. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 

బైక్‌ రైడ్‌ తర్వాత బోట్‌లో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టి వచ్చారు సీఎం. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

అస్సాంలోని కచార్‌, చిరాంగ్‌, మోరిగావ్, నగావ్‌, తముల్పూర్‌ జిల్లాలు నీట మునిగాయి. సుమారు 2,50,300 మందిపై వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో 76 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది అస్సాం ప్రభుత్వం. ఇప్పటి వరకు 17,014 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. బొంగాయ్‌గావ్‌, ధుబ్రీ, కమ్రూప్‌, లఖింపుర్‌, మంజులీ, మోరిగావ్, దక్షిణ సల్మారా, టింసుకియా జిల్లాల్లో వరదల కారణంగా భూములు కోతకు గురయ్యయి.

ఇదీ చూడండి: అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి!

మరిన్ని వార్తలు