కేవలం అది మాత్రమే ప్రమాణం కాకూడదు: డీలిమిటేషన్‌పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

1 Jan, 2023 16:16 IST|Sakshi

డీలిమిటేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్‌ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్‌ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు.

అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అ‍న్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు.

ఈ డీలిమిటేషన్‌ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్‌ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు.

కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్‌ జిల్లాను సోనిత్‌పూర్‌లో, హోజాయ్‌ను నాగావ్‌లో, తముల్‌పూర్‌ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్‌పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం  ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 

(చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు)

మరిన్ని వార్తలు