పెళ్లికి కూడా సెలవు తీసుకోని ఐఏఎస్‌

14 Sep, 2020 06:10 IST|Sakshi

కోవిడ్‌–19 విధుల్లో ఆ డిప్యూటీ కమిషనర్‌ బిజీ

వరుడే పుణే నుంచి అస్సాం వెళ్లి పెళ్లి చేసుకున్న వైనం

వధువు కీర్తి స్వస్థలం హైదరాబాద్‌

గువాహటి: కోవిడ్‌–19 విధుల్లో బిజీగా ఉన్న ఓ ఐఏఎస్‌ అధికారిణి వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణనే ఆమె మిన్నగా భావించారు. అందుకే, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన తన వివాహానికి కూడా సెలవు తీసుకోలేదు. దీంతో వరుడే  వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ ఘటనలో వధువుది హైదరాబాద్‌ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్‌ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న చచర్‌ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి.

ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్‌ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్‌ వెళ్లాడు. కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ ప్రకారం అక్కడ క్వారంటైన్‌లో గడిపాకే వివాహ తంతు జరిపించారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్‌ వీడియో యాప్‌ ద్వారా 800 మంది చూశా రు. ‘హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మానాన్నలకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది’అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. పెళ్లి రోజు బుధవారం కూడా ఫోన్‌ ద్వారా బాధ్యతలు కొనసాగించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా