వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్

7 Jun, 2021 12:16 IST|Sakshi

మరోసారి అసోంలోని ఆసుపత్రిలో వైద్యుల బృందం

డ్యాన్స్ చేసిన డాక్టర్ జూరీ శర్మ బృందం

 కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు  ప్రయత్నాలు

అసోం: కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ భయపెడుతున్న సమయంలో అసోంలోని కరోనా ఆసుపత్రి వైద్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చార్  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బృందం  పాటలు ,డాన్స్‌లతో కరోనా బాధితులను ఉత్సాహ పరిచేందుకు  ప్రయత్నించిన తీరు పలువురు ప్రశంసలందుకుంటోంది. వీరితోపాటు కరోనాకు చికిత్స పొందుతున్నవారు కూడా కలిసి నృత్యం చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు అత్యంత ఒత్తిడికి గురవుతున్న రోగుల కుటుంబ సభ్యులకు భరోసాతో నిస్తున్నారు. పీపీఈ కిట్లలో బెంగాలీ, హిందీ పాటలతోపాటు, జానపద పాటలకు వీరు వేసిన స్టెప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హమ్ హోంగే కామియాబ్‌తో పాటు, బరాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రసిద్ధ జానపద నృత్యం ధమాయిల్ ను కూడా వారు ప్రదర్శించారు. దీంతో వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


  
అసోం, కాచర్ జిల్లాలోని సిల్చార్ ఎస్ఎం దేవ్ సివిల్ హాస్పిటల్‌ ఆరోగ్య సంరక్షణ నిపుణులు కోవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు నృత్యాలను ఒక సాధనంగా ఉపయోగించు కున్నారు. తద్వారా వారిలో  ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. డాక్టర్ జూరీ శర్మ నాయకత్వంలోని ఈ బృందం పీపీఈ  సూట్లలో రోగులతో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. కాగా  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు దేశంలో సోమవారం కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,427  మరణాలు సంభవించాయి.

మరిన్ని వార్తలు