Assam Floods 2022: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి

19 May, 2022 11:15 IST|Sakshi

దిస్పూర్‌: ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది  వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న  3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు.

వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.

వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్‌గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు.

వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని  సీఎం తెలిపారు.

ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది.

తిరగబడ్డ రైలు బోగీలు
వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు  ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని వార్తలు