నువ్వు తోపు బ్రదర్‌.. కల నెరవేర్చుకున్న యువకుడు.. వీడియో వైరల్‌

22 Mar, 2023 16:49 IST|Sakshi

అదో బైక్‌ షోరూం.. వర్కర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉ‍న్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన భుజాన ఓ సంచి వేసుకుని షోరూమ్‌కి వచ్చాడు. తనకు ఓ స్కూటర్‌ కావాలని అక్కడున్న వారిని కోరాడు. దీంతో, అక్కడున్న స్కూటర్లను చూసి ఒకదాన్ని ఓకే చేసుకున్నారు. అయితే, డబ్బులు చెల్లించే సమయంలో అతడు తన వద్ద ఉన్న 10 రూపాయల నాణేలను ఇవ్వడంతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా.. అతడి కోరికను చూసి అభినందించారు. ఏకంగా రూ. 90వేలకు సరిపడే 10 రూపాయల నాణేలను లెక్కించి స్కూటర్‌ను అతడికి అప్పగించారు.

వివరాల ప్రకారం..  బైక్ కొనుక్కోవడం ప్రతి సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొందరు డబ్బులను జమ చేసుకుని కొనుగోలు చేస్తారు. అయితే, అసోంకు చెందిన వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం రూ.90 వేలు కూడబెట్టి.. చివరికి తనకు ఇష్టమైన ద్విచక్ర వాహనాన్ని కొని ఇంటికి తీసుకెళ్లాడు. 

అసోంలోని దరంగ్‌ జిల్లాలో సిపజార్‌కు చెందిన మహమ్మద్‌ సైదుల్‌ హక్‌ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. చిన్న షాప్‌ నడుపుకునే సైదుల్‌కు ‍స్కూటర్‌ కొనాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దీంతో, తనకు ఇష్టమైన బైక్‌ కోసం ఐదారేళ్లుగా డబ్బును జమ చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రతీ రోజు అతడు రూ.10 నాణేలను పోగు చేశాడు. ఇలా 90వేల రూపాయలు పొదుపు చేశాడు. ఇన్ని రోజులు జమ చేసిన నాణేలను కొన్ని డబ్బాల్లో ఓ సంచిలో వేసుకుని షోరూమ్‌కు వెళ్లాడు. అనంతరం, బైక్‌ను కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సైదుల్‌ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. 


అయితే, అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు తన డ్రీమ్‌ బైక్‌(కేటీఎం) కోసం చిల్లరను జమచేశారు. రూ.2.85 లక్షలకు సరిపడే రూపాయి కాయిన్స్‌ పొదుపు చేసి బైక్‌ కొనుగోలు చేశారు. అలాగే, తమిళనాడులోని సేలాం జిల్లాకు చెందిన వెట్రివేల్‌ అనే వ్యక్తి రూ. 10 నాణేలను జమ చేసి కారును కొనుగోలు చేశాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయ్యింది. 

ఇది కూడా చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. షాకింగ్‌ వీడియో

మరిన్ని వార్తలు