400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు

12 Sep, 2020 08:48 IST|Sakshi

నలభై మూడేళ్ల రామానంద సర్కార్‌కి అలసట తెలుస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్లకు మాత్రమే అతడు ‘అలసిపోయాను’ అనే మాట అన్నాడు. ‘‘మొదట్లో రోజుకు ఒకటీ రెండు ఉండేవి. ఇప్పుడు 10–12 వరకు ఉంటున్నాయి’’ అంటున్నాడు. ఏప్రిల్‌ నుంచి మొన్న మంగళవారం వరకు అతడు 400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. వైరాగ్యం మనసును ఆవరించి అతడు ‘అలసిపోయాను’ అనడం కాదు. శారీరకంగానే ‘చితి’ కి పోయాడు. గౌహతి లోని ఉలుబరి దహనస్థలి అతడి కార్యక్షేత్రం. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు పని మొదలవుతుంది. తెల్లవారు జామున మూడు గంటల వరకు అతడి కష్టం, కాష్టం కాలుతూనే ఉంటాయి. తనే అన్నీ చేర్చుకోవడం, పేర్చుకోవడం.

ఇద్దరు సహాయకులు ఉంటారు. రెండేళ్ల క్రితం మోరిగావ్‌ జిల్లాలోని జాగిరోడ్‌ గ్రామం నుంచి పని వెతుక్కుంటూ గౌహతి వచ్చాడు రామానంద సర్కార్‌. భూతనాథ్‌ శ్మశాన వాటికలో పని దొరికింది. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం అతడి కైవల్య సేవల్ని రద్దీ ఎక్కువగా ఉండే ఉలుబరి కోసం అద్దెకు తీసుకుంది. కరోనాతో ఆ రద్దీ మరింత పెరిగింది. అథ్గావ్, ఇస్లాంపుర్‌ లో ఉన్న ఖనన వనాలకు ఇక్కడి నుంచి ‘కొందరిని’ పంపినా ఉలుబరి ‘వేచియుండు వరుస’ తగ్గేది కాదు, తరిగేదీ కాదు. మొదటిసారి కరోనా కాయాన్ని తాకడానికి రామానంద సర్కార్‌ భయపడ్డాడు. ఇప్పుడు ఆ భయం లేదు. అనేకసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా ఒక్కసారీ కరోనా అతడిని తాకలేదు! అలసట మాత్రం ఆవరించింది. కరోనాకు కాలం తీరితేనే అతడి అలసట తీరుతుంది. పని మానేసి వెళ్లిపోవాలని మాత్రం రామానంద సర్కార్‌ అనుకోవడం లేదు.
 

మరిన్ని వార్తలు