అస్సాం, నాగాలాండ్‌ల మధ్య కీలక ఒప్పందం

1 Aug, 2021 01:18 IST|Sakshi

దిమాపుర్‌/గువాహటి: అస్సాం, నాగాలాండ్‌ల మధ్య ముదిరిన సరిహద్దు వివాదానికి తాత్కాలిక బ్రేక్‌ పడే దిశగా ఇరు రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకున్నాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బరువా, నాగాలాండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే ఆలంలు శనివారం భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల బలగాలు మోహరించి ఉన్న దెసోయ్‌ లోయ అడవి/సురాంగ్‌కాంగ్‌ లోయ ప్రాంతాల నుంచి పరస్పరం వెనక్కు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న పలు గ్రామాల నుంచి బలగాలను వెనక్కు పంపడం ద్వారా అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది.

24 గంటల్లోగా బలగాలు వెనక్కు వెళ్లాలని ఇరు ప్రభుత్వాల నేతలు కలసి నిర్ణయించారు. నాగాలాండ్‌ డిప్యూటీ సీఎం వై పట్టాన్, అస్సాం విద్యా శాఖ మంత్రి రనోజ్‌ పెగు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాలు కలసి మానవరహిత ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ) ద్వారా ఆయా ప్రదేశాలను మానిటర్‌ చేయనున్నారు. బలగాలను వెనక్కు తీసుకెళ్లే బాధ్యతలను సరిహద్దు (వివాదమున్న) జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. వివాదాలను తగ్గించేందుకు అవసరమైన కీలక పరిష్కారం ప్రధాన కార్యదర్శుల భేటీ ద్వారా జరిగినట్లు అస్సాం   సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు