కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా? రచయిత్రి వ్యాఖ్యలు దుమారం

7 Apr, 2021 15:31 IST|Sakshi

గౌహతి: ఛత్తీస్‌గడ్‌లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫేసుబుక్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అని ప్రశ్నించింది. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని రచయిత్రి శిఖాశర్మ పేర్కొన్నారు. 

గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి ఆమె ఫేసుబుక్‌ పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక‌్షన్‌ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రచయిత్రి శిఖాశర్మను డిస్పూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

శిఖాశర్మ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు ఇదే..
‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్‌ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. శిఖా శర్మ ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది కూడా. 

మరిన్ని వార్తలు