కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి

12 May, 2021 13:20 IST|Sakshi

దిస్పూర్: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్‌ బర్గోహెయిన్‌ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అస్సాంలోని లక‌్ష్మీపూర్‌ జిల్లా దుకువాఖానాలో డిసెంబర్‌ 7, 1932న హోమెన్‌ జన్మించారు. అస్సామీలో రచించిన ‘పిటా పుత్రా’ అనే రచనకు 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. అయితే 2015లో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన ఆ అవార్డు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ‘సౌదర్‌ నవ్‌ మెలీ జయ్‌’, ‘హల్దోయా సొరయే బౌదన్‌ ఖాయ్‌’, ‘అస్తరాగ్‌’, ‘తిమిర్‌ తీర్థ’, ‘మత్స్యగంధ’, ‘సుబాల’, ‘నిసంగట’, ‘ఆత్మాన్సుకందన్‌’, ‘గద్యర్‌ సాధన’, ‘ప్రొగ్యర్‌ సాధన’ తదితర రచనలు చేశారు.

అస్సాం భాషలో ఎంతో సాహిత్య సేవ చేశారు. హోమెన్‌ భార్య నిరుపమ తములీ కూడా ప్రముఖ రచయిత్రి. ఆమె కూడా ఎన్నో రచనలు చేశారు. హోమెన్‌ పాత్రికేయుడిగా కూడా పని చేశారు. అసోం సాహిత్య సభకు 2001లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లు అసోం సివిల్స్‌ సర్వీస్‌ అధికారిగా కూడా పని చేశారు.

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య

మరిన్ని వార్తలు