ప్రాణం తీసిన కోడి కూర వివాదం

3 Jan, 2021 10:46 IST|Sakshi

భోగాపురం: కోడి కూర కోసం రేగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మృతుడి ఇంట విషాదం నింపింది.  మండలంలోని గుడివాడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, తోటి కూలీలు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... కూలీ పనులు చేసుకుని ఒకే చోట ఉంటూ జీవనం సాగిస్తున్న ఐదుగురు కూలీలు కోడి కూర కోసం గొడవ పడ్డారు. ఈ వివాదంలో కాకి అప్పన్న(38)ను నక్క ప్రసాద్‌ గజం బద్దతో కొట్టి చంపాడు. నెల్లిమర్లకు చెందిన నక్క ప్రసాద్, బొద్దాన ఆదినారాయణ, శొట్యాన శ్రీను, కాకి అప్పన్న, దర్మాపు రమణ కలిసి  నెల్లిమర్లకు చెందిన మేస్త్రీ తివనాల రమణ దగ్గర కూలీ పనులు చేస్తున్నారు. మేస్త్రీ రమణ విశాఖపట్నంకు చెందిన ఉదయ్‌ అనే బిల్డర్‌ వద్ద మండలంలోని గుడివాడలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులను కాంట్రాక్టు తీసుకున్నాడు.

ఈ క్రమంలో ఐదుగురికి అపార్ట్‌మెంట్‌ వద్ద నివాసం ఉండేలా జార్జపుపేట గ్రామానికి చెందిన పాపయ్యమ్మను వంటకు పెట్టి వారికి మెస్‌ ఏర్పాటు చేశాడు.  నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం పాపయ్యమ్మ వారికి కోడి కూరతో భోజనం తయారు చేసి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. బయటకు వెళ్లిన ఐదుగురిలో ప్రసాద్, అప్పన్న, రమణ, శ్రీను  రాత్రి అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసే సమయంలో  ప్రసాద్, అప్పన్నల మధ్య కోడి కూర కోసం గొడవ జరిగింది. కోపోద్రేకానికి గురైన ప్రసాద్‌ గజం బద్దతో అప్పన్నపై దాడికి దిగాడు.  మిగిలిన ముగ్గురు ప్రసాద్‌ను అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశాడు.

దీంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. అప్పన్న ఒక్కడే కావడంతో అతనిపై విచక్షణరహితంగా దాడి చేసి చేయి విరిచి తల,  మర్మాంగాలపై దాడి చేసి హతమార్చి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అప్పన్న భార్య లక్ష్మి తన పిల్లలు లావణ్య, ఉమశంకర్‌తో కలిసి ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సామాజిక ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శొట్యాన శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ యు.మహేశ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు