ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధం

30 Jul, 2021 04:29 IST|Sakshi

–ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా రాకేశ్‌ ఆస్తానాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఆయన నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అధికార పక్షం ఆప్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. వివాదాస్పదుడైన ఓ అధికారిని దేశ రాజధానిలోని పోలీసు బలగాలకు అధిపతి కారాదని తీర్మానం పేర్కొంది. ఆస్తానా నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నా రు.

నిబంధనలకు లోబడి కేంద్రం నియామకాలు చేపట్టాలన్నారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసున్న ఏ అధికారిని కూడా దేశంలో పోలీసు విభాగాధిపతిగా నియమించరాదంటూ 2019 మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఆస్తానాను నియమిస్తున్నట్లు మంగళవారం తెలిపిన కేంద్రం..ఆయన సర్వీసును ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది.  ‘పదవీకాలం రీత్యా ఆయన అనర్హుడు కాబట్టే సీబీఐ డైరెక్టర్‌గా పరిగణనలోకి తీసుకోలేదు. మరి అదే నిబంధన ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నియామకానికి కూడా వర్తించాలి కదా.. అని కేజ్రీవాల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు