అస్ట్రాజెనెకా సురక్షితం

27 Nov, 2020 06:13 IST|Sakshi

భారత్‌లో సాఫీగా ప్రయోగాలు

రేపు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రధాని

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌ గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్న నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యంపైనే అందరి దృష్టి ఉంది. ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైనదని, సమర్థవంతంగా పని చేస్తోందని సీరమ్‌ ఇన్‌నిస్టిట్యూట్‌ వెల్లడించింది. భారత్‌లో ప్రయోగాలు సజావుగా సాగుతున్నాయని గురువారం  వెల్లడించింది. ‘‘అస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైనది. 60–70 శాతం సామర్థ్యమే కలిగి ఉన్నప్పటికీ ఈ టీకాపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచవచ్చు’’అని తెలిపింది.  

సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కి ప్రధాని
ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు ఆశలు కల్పిస్తూ ఉండడంతో శనివారం ప్రధాని మోదీ పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో టీకా ప్రయోగాలపై, డోసుల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ వంటివాటిపైన చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో 100 దేశాల రాయబారులు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించనున్నారు.

డోసుల్లో పొరపాటు సామర్థ్యాన్ని పెంచింది  
అస్ట్రాజెనెకా ప్రయోగాల్లో డోసులు ఇవ్వడంలో పొరపాటు వల్ల వ్యాక్సిన్‌ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు రుజువు కావడం అందరిలోనూ ఆశలు పెంచుతోంది.  ఈ ప్రయోగాల్లో నెల రోజుల తేడాలో రెండు డోసులు ఇవ్వాలి. వైద్యులు పొరపాటుగా మొదటి డోసు పరిమాణాన్ని సగానికి తగ్గించి ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకున్న వైద్యులు మరో బృందానికి పూర్తి డోసు ఇచ్చారు. అలా రెండు డోసులు పూర్తయ్యాక డోసున్నర తీసుకున్న వారిలో 90% సామర్థ్యం, రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారిలో 62% సామర్థ్యంతో టీకా పని చేసింది. దీంతో  సగటున 70% సామర్థ్యాన్ని ఈ టీకా కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  

>
మరిన్ని వార్తలు