మొన్ననే ప్రారంభం.. అంతలోనే ప్రమాదాలు

6 Oct, 2020 12:12 IST|Sakshi

మొదలైన 72 గంటల్లోనే మూడు ప్రమాదాలు

సిమ్లా: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్‌ రోహ్‌తంగ్‌ టన్నెల్‌ ప్రమాదాలకు నెలవుగా మారింది. సేవలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఆ రహదారిపై మూడు వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు తోలడం, కొందరు యువకులు బైకులపై రేసింగులు చేయడంతో ఈ ప్రమాదాలు జరిగినట్టు బోర్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) తెలిపింది. ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రన్నింగ్‌లోనే కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారని బీఆర్‌ఓ చీఫ్‌ ఇంజనీర్‌ బ్రిగేడియర్‌ కేపీ.పురుషోత్తం ఆందోళన వ్యక్తం చేశారు.
(చదవండి: డాక్టర్‌ అందమైన జ్ఞాపకం.. రాక్‌చమ్‌ కుగ్రామం)

అంతేకాకాండా టన్నెల్‌ మధ్యలో ఎవరూ వాహనాలు నిలుపొద్దని సూచించారు. టన్నెల్‌ లోపల సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన ట్రాఫిక్‌ అధికారులను కోరారు. ఈ విషయంపై కులు ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. టన్నెల్‌ లోపల రాష్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడింగ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే టన్నెల్‌ లోపల సీడ్‌ గన్స్‌ ఆధారంగా అతివేగంగా వెళ్లిన వారికి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. టన్నెల్‌ లోపల గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టన్నెల్‌ లోపల రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్‌లాల్‌ మర్కంద స్థానిక అధికారులను ఆదేశించారు.

ఇదిలాఉండగా.. అటల్‌​ రోహ్‌తంగ్‌ టన్నెల్‌ ద్వారా పేలుడు పదార్థాల రవాణాను బీఆర్‌ఓ నిషేధించింది. వచ్చే రెండు నెలలపాటు డీజిల్‌, పెట్రోల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌​ సిలిండర్లు, కిరోసిన్‌పై తాత్కాలిక నిషేధం విధించినట్టు వెల్లడించింది. దాంతోపాటు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 వరకు.. మొత్తం రెండు గంటలపాటు మెయింటెన్స్‌ నిమిత్తం టన్నెల్‌ మూసి ఉంటుందని తెలిపింది. కాగా, హరియాణాలోని 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్‌ను ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించారు.
(చదవండి: బాధ్యతగా కృత్రిమ మేధ వినియోగం: మోదీ)

మరిన్ని వార్తలు