నడ్డాపై దాడి: ‘ప్రతీకారం తీర్చుకుంటాం’

11 Dec, 2020 12:28 IST|Sakshi

కోల్‌కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ నాయకుల మధ్య మాటల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డితో సహా చెల్లిస్తామని బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ హెచ్చరించారు. ‘మేం మారుస్తాం.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం. వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ దిలీప్‌ ఘోష్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. డైమండ్‌ హర్బర్‌లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌ని అడ్డుకోవడమే కాక రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన అనంతరం బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

బెంగాల్‌ డీజీపీకి సమన్లు
ఇక నడ్డా కాన్వాయ్‌పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్‌ షా గవర్నర్‌ని కోరిన సంగతి తెలిసిందే.

బీజేపీ రియాక్షన్‌..
నడ్డాపై దాడిని బెంగాల్‌ బీజేపీ నాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఈ క్రమంలో సయంతన్‌ బసు ‘మీరు ఒక్కరిని చంపితే.. మేం నలుగురిని చంపుతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి అనంతరం ఢిల్లీలోని అభిషేక్‌ బెనర్జీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని ఉద్దేశిస్తూ.. బసు ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు ముందు చాలా ఉంటాయి’ అంటూ హెచ్చరించారు. 
 

>
మరిన్ని వార్తలు