శివసేన నేత దారుణ హత్య.. పట్టపగలే తుపాకులతో రెచ్చిపోయారు..

4 Nov, 2022 16:46 IST|Sakshi

Sudhir Suri.. శివసేన నేత సుధీర్‌ సూరి దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన శివసేన నేత సుధీర్‌ సూరి.. శుక్రవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఓ ఆలయ ప్రాంగణం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించడంతో శివసేన నాయకులు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివసేన నాయకులకు మద్దతిస్తూ సుధీర్‌ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు సుధీర్‌పై కాల్పులు జరిపారు. దీంతో, సుధీర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. కాల్పులు జరిపిన వ్యక్తిని శివసేన నాయకులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, కొద్దిరోజుల క్రితం సుధీర్‌ సూరి ఓ వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ.. మతపరంగా మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సుధీర్‌ సూరి.. హిట్‌ లిస్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా ఆయనపై కాల్పులు జరపడం సంచలనంగా మారింది. 

ఇక, సుధీర్‌ హత్యపై బీజేపీ నేత తజీందర్‌ సింగ్‌ బగ్గా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా తజీందర్‌ బగ్గా.. ‘పంజాబ్‌లో శాంతి భ్రదతలు పూర్తిగా విఫలమయ్యాయి. అమృత్‌సర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో శివసేన నాయకుడు సుధీర్‌ సూరి తీవ్రంగా గాయపడ్డారు’ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

మరిన్ని వార్తలు