COVID Third Wave: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..

21 Dec, 2021 15:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్‌ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్‌ రెండో వేరియంట్‌ డెల్టాప్లస్‌ కంటే కూడా ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్‌ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్‌ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్‌ కంటే ఒమిక్రాన్‌ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ హాంగ్‌ కాంగ్‌ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.  ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్‌ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్‌ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం సంభవించడంతో యావత్‌ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది.

చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్‌ఎస్

>
మరిన్ని వార్తలు