మధ్యప్రదేశ్‌ సీఎం కనుసన్నల్లో భారీ స్కాం.. ఆడిట్‌ నివేదికలో సంచలన విషయాలు?

4 Sep, 2022 19:39 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పోషకాహార పథకంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్‌ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్‌ గుర్తించారు. 

పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకి రావటం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది.  2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు. 

నకిలీ ట్రక్కులు.. 
పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు స్పష్టమవుతోంది. 

9వేలు ఉండాల్సింది.. 36.08 లక్షలు
రేషన్‌ తీసుకునేందుకు అర్హులైన పాఠశాల మానేసిన బాలికల వివరాలను 2018, ఏప్రిల్‌లోపు సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, 2021, ఫిబ్రవరి వరకు ఆ వివరాలను సేకరించలేకపోయింది మహిళా, శిశుసంక్షేమ శాఖ. మరోవైపు.. పాఠశాల విద్యా విభాగం రాష్ట్రంలో స్కూల్‌ మానేసిన బాలికలు 2018-19 మధ్య 9వేల మంది ఉంటారని అంచనా వేసింది. అయితే, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఎలాంటి సర్వే నిర్వహించకుండానే 36.08 లక్షల మందిగా తేల్చింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించగా ఎలాంటి స్పందన లేదని పలు మీడియాలు వెల్లడించాయి. 

ఇదీ చదవండి: ‘రామన్‌ మెగసెసె’ అవార్డు తిరస్కరించిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి

మరిన్ని వార్తలు