మలబార్‌ డ్రిల్‌లో ఆస్ట్రేలియా

20 Oct, 2020 04:30 IST|Sakshi

చైనాకు చెక్‌ పెట్టేందుకు..

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్‌ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్‌లో జరగనున్న మలబార్‌ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్‌ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్‌) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే.

ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్‌ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు