మానవత్వం బతికే ఉంది.. కరోనా పేషెంట్లకు ఫ్రీ రైడ్‌

23 Apr, 2021 14:40 IST|Sakshi

రాంచీ: ప్రజలు కోవిడ్ మహమ్మారి సోకి నరకయాతన అనుభవిస్తుంటే కొందరు మాత్రం‌ రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దొరికినంత దోచుకుంటున్నారు. ఇటీవల రెమ్‌డిసెవర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్‌లో వేలల్లో వీటిని అమ్ముకున్న సంగతి తెలిసింతే. వీళ్లు మానవత్వం చూపించకపోయినా ఫర్వాలేదు కానీ ప్రాణాలతో ఇలా వ్యాపారం చేయకూడదనే విషయాన్ని కూడా మరిచారు. ఓ వైపే ఇలా ఉంటే మరోవైపే  మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందనేందుకు నిదర్శనంగా కొందరు కరోనా రోగులను తమ వంతు సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాంచీలో ఓ ఆటోడ్రైవర్‌ కరోనా పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచాడు.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కోవిడ్‌ పేషెంట్ల కష్టాలు చూసి తన వంతు సహాయంగా ఏమైనా చేయదలచాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అంతేగాక సోషల్‌ మీడియాలో తన ఫోన్‌ నెంబర్‌ని పెట్టాడు. ఆటోకి కూడా ఫోన్ నెంబర్‌తో ఉన్న పోస్టర్‌ని అతికించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కోవిడ్‌ రోగులను హాస్పిటల్‌కి తీసుకెళ్లుతున్నాడు. వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఇలా చేయడానిక ఓ కారణం ఉందని.. ఈనెల 15న కోవిడ్‌ సోకిన ఓ మహిళను రిమ్స్‌ హాస్పిటల్లో దింపగా ఆ తర్వాత ఆమెని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహిళ ఆ రోజు పడిన వేదన చూసినప్పటి నుంచి ఈ ఫ్రీ రైడ్ ప్రారంభమైందని అంటున్నాడు‌. అసలే కర్ఫ్యూ, అది కాకుండా పెరిగిన పెట్రోల్‌ ధరలతో ఆటో పై వచ్చే సంపాదన ఎంత. కానీ లాభాపేక్ష లేకుండా కేవలం మానవత్వంతో ఈ ఆటోడ్రైవర్‌ చేస్తోన్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

( చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు! )

మరిన్ని వార్తలు