కశ్మీర్‌ కథ ఎటు..? 

23 Jun, 2021 00:58 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాని మళ్లీ కట్టబెడతారా?

నియోజకవర్గాల పునర్విభజనపై పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తారా?  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం కశ్మీర్‌ కథకు ఎలాంటి ముగింపు రాయబోతోంది?

కశ్మీర్‌పై కేంద్రం ఎజెండా ఏమిటి? స్థానిక నేతల మనసులో ఏముంది?

జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దు (ఆగస్టు 5, 2019) తర్వాత మంచుకొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కశ్మీర్‌ రాజకీయ పార్టీ నేతలతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టడానికి ఏయే పార్టీలు సహకరిస్తాయో, ఎవరెవరు వ్యతిరేకిస్తూ వేర్పాటువాద చిచ్చు రగులుస్తారో  తెలుసుకోవడానికి... ఈ సమావేశాన్ని కేంద్రం వేసిన తొలి అడుగుగా భావిస్తున్నారు. కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అందరితో కలుపుకొని పోయేలా నిర్వహించడం కోసమే ప్రధాని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.  

ఎజెండా ఏమిటి?  
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో హమీ ఇచ్చారు. రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలకు వెళ్లాలంటే దాని కంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. జమ్మూకశ్మీర్‌  పునర్వవ్యస్థీకరణ చట్టం– 2019 కశ్మీర్‌ అసెంబ్లీ బలాన్ని 107 నుంచి 114కి పెంచింది. ఇందులో 24 సీట్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఏడు నియోజకవర్గాల సరిహద్దులు, జనాభా, భౌగోళిక స్వరూపంపై సమగ్ర నివేదిక కోసం నియోజకవర్గాల పునర్విభజన కమిటీకి బాధ్యతలు అప్పగించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రంజన్‌ ప్రకాశ్‌ దేశాయ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉంటాయని అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గాల పునర్విభజనపై తొలుత అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే సమయం వచ్చినప్పుడు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉంది.  

రాజకీయ చిత్రం జమ్మూకి అనుకూలంగా మారుతుందా?  
నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ ప్రాంతానికి అనుకూలంగా రాజకీయాలు మారే అవకాశాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి  జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఇన్నాళ్లూ కశ్మీర్‌కు చెందిన నాయకుల ఆధిపత్యం వల్ల జమ్మూ అభివృద్ధిపై వివక్ష ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెరగడం వల్ల బీజేపీ రాజకీయంగా బలపడుతుందని, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ ముఫ్తీ కుటుంబాల హవాకు తెరపడి వేర్పాటువాద శక్తులు బలహీనంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలోని 37 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 25 స్థానాలను కొల్లగొట్టింది. ఈ ప్రాంతంలో సీట్లు పెరిగితే రాజకీయంగా బలపడాలనే ఆలోచనలో కేంద్రంలోని అధికార బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘జమ్మూకశ్మీర్‌ మొత్తం జనాభాలో 55% కశ్మీర్‌లో ఉంటే సీట్లు 53% ఉన్నాయి. అదే జమ్మూలో జనాభా 43% ఉంటే సీట్లు 42.5% ఉన్నాయి. విస్తీర్ణంలో కశ్మీర్‌లో కంటే జమ్మూలో నియోజకవర్గాలు చాలా పెద్దవి. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరకి నాయకులు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్‌ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే కేంద్రం కట్టుబడి ఉంది. అందరి ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది’’ అని కశ్మీర్‌ బీజేపీ నేతలు చెబుతున్నారు.  

ఎందుకింత ప్రాధాన్యం? 
పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో బీజేపీ ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించింది. అప్పట్నుంచి కశ్మీర్‌ కేంద్ర పాలనలోనే ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను విడదీస్తూ... రెండు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ...  జమ్మూకశ్మీర్‌ పునర్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసి,  పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కశ్మీర్‌ కథకి ప్రజాస్వామ్యబద్ధమైన ముగింపు ఇవ్వడానికే అఖిలపక్షాన్ని పిలవడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత తొలిసారి ఒక రాజకీయ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టడం, నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన నాయకుల్ని సమావేశానికి పిలవడంతో ఈ సమావేశంలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.  

విపక్షాలు ఏమంటున్నాయి ? 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్‌కు చెందిన 14 మంది నాయకులకు ఆహ్వానం పంపితే ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తిరిగి కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ ఏర్పాటైన ఏడు పార్టీల కూటమి గుప్కర్‌ అలయెన్స్‌ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించింది. గత ఏడాది జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో మొత్తం 278 స్థానాల్లో గుప్కర్‌ కూటమి 110 స్థానాలను గెలుచుకొని బీజేపీకి గట్టి సవాల్‌ విసిరింది. బీజేపీ 75 స్థానాలకు పరిమితం కాగా, ఏకంగా 50 సీట్లలో స్వతంత్రులు నెగ్గారు. ఇప్పుడు ఆ కూటమి నేతలు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఈ తరహా సమావేశాలకు దూరంగా ఉండే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూడా అఖిలపక్ష సమావేశానికి రానుంది. జమ్ము కశ్మీర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్య ప్రధాని దృష్టికి తీసుకురావడమే తమ లక్ష్యమని, ప్రత్యేకంగా ఎజెండా అంటూ తమకేమీ లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున ఆహ్వానం అందుకున్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ సంపూర్ణ రాష్ట్ర హోదాయే తమ డిమాండ్‌ అని స్పష్టం చేశారు.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు