డ్రోన్ల ఆపరేషన్‌ సులభతరం

27 Aug, 2021 06:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నూతన డ్రోన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. డ్రోన్‌లకు సంబంధించిన కొత్త నియమాలు, మార్గదర్శకాలు విడుదల కావడంతో భారతదేశంలో డ్రోన్‌ రంగానికి ఒక చరిత్రాత్మక క్షణం ప్రారంభమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డ్రోన్‌లకు సంబంధించిన కొత్త నిబంధనలు స్టార్టప్‌లతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న యువతకు ఎంతో సహాయకారిగా ఉంటాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో డ్రోన్‌ వినియోగం పెరగడానికి నూతన మార్గదర్శకాలు ఉపయోగపడనున్నాయి.  డ్రోన్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనుంది.  

రూ.100కు రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ ఫీజు కుదింపు
నూతన డ్రోన్‌ విధానం ప్రకారం అన్ని డ్రోన్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు డ్రోన్‌ నిర్వహణ, లైసెన్స్, సర్టిఫికెట్‌ కోసం సెక్యూరిటీ క్లియరెన్స్‌ పొందవలసిన అవసరం లేదు. వాణిజ్యేతర ఉపయోగం కోసం వినియోగించే మైక్రో డ్రోన్‌లకు, నానో డ్రోన్‌లకు రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ అవసరం లేదని నూతన విధానంలో పొందుపరిచారు.  డీజీసీఎ డ్రోన్‌ శిక్షణ అవసరాలను పరిశీలించడమే కాకుండా, పైలట్‌ లైసెన్స్‌లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తుంది. డ్రోన్‌ సైజుతో సంబంధం లేకుండా అన్నింటికీ రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ ఫీజు రూ.3వేల నుంచి రూ.100కి తగ్గించారు.

గ్రీన్‌జోన్‌లో అనుమతి అక్కర్లేదు
రెడ్‌ లేదా ఎల్లో జోన్లలో డ్రోన్‌లను ఆపరేట్‌ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ డ్రోన్‌ ఎగరవేయడానికి అనుమతించరు. భూమి నుంచి 400 అడుగుల ఎత్తువరకు గ్రీన్‌జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్‌లు ఎగరడానికి అనుమతి అవ సరం లేదు. విమానాశ్రయం చుట్టుపక్కల ఎల్లో జోన్‌ను 8–12 కి.మీ.లకు  తగ్గించారు. సరళీకృత నిబంధనల్లో డ్రోన్‌ల వినియోగానికి చేసే దరఖాస్తుల సంఖ్యను 5కి తగ్గించారు. ఫీజుల రకాలను సైతం 72 నుంచి 4కి కుదించారు.  గ్రీన్‌ జోన్‌లో ఉన్న సొంత లేదా అద్దె ప్రాంగణంలో డ్రోన్‌లను వినియోగిస్తున్న పరిశోధనా సంస్థలకు టైప్‌ సర్టిఫికెట్, ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ అవసరం లేదు.

మరిన్ని వార్తలు