పాపం అవినాష్‌.. కరోనాతో మరణించాక డీఎస్‌పీ కొలువొచ్చింది

1 Jul, 2021 19:25 IST|Sakshi

పాట్నా: ప్రస్తుత కాలంలో సర్కారీ కొలువు సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఆ క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్టప‌డుతుంటారు. ఇలా చాలా మంది నిరుద్యోగుల్లాగే బిహార్‌కు చెందిన అవినాష్‌ కూడా సర్కారీ కొలువు సాధించాలని కలలు కన్నాడు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ఆ యువకుడి క‌ల‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఉద్యోగాని ఎంపికయ్యాడన్న వార్త తెలీనీకుండానే అతన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల అవినాష్‌కు చిన్నప్పటి నుంచి బీహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌లో(బీపీఎస్‌సీ) ఉద్యోగం సాధించాలని క‌ల ఉండేది.

దాని కోసం రేయి పగలనకుండా క‌ష్టప‌డి చదివాడు. బిటెక్‌ పూర్తి చేసి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజ‌నీర్ ఉద్యోగాన్ని ప‌క్కన పెట్టి కోచింగ్ తీసుకొని మరీ ప‌రీక్షలు రాశాడు. అయితే ప‌రీక్షలు రాసిన అనంతరం అవినాశ్ క‌రోనా బారిన ప‌డ్డాడు. కొన్నిరోజుల పాటు డాక్టర్ల సలహాలతో ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే, డిశ్చార్జ్ అనంతరం అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించ‌డంతో తిరిగి ఆసుప‌త్రిలో చేరాడు. ఈ క్రమంలో గత నెల(జూన్‌) 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృత్యువాత పడ్డాడు.

అయితే, జూన్ 30 వ తేదీన బీహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వెల్లడించిన ఫలితాల్లో అవినాశ్‌.. డిప్యూటీ కలెక్టర్‌(డీసీ) లేదా డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఎస్‌పీ) స్థాయి ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. అయితే అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన క‌ల సాకారమైందని సంతోషించడానికి అవినాశ్ లేడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగ ఫలాలు అనుభవించేందుకు తమ బిడ్డ లేడని గుండెలు పగిలేలా ఎడుస్తున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో స్టేట్‌ సెకెండ్‌ ర్యాంకర్‌ అయిన అవినాష్‌.. క్యాంపస్‌ సెలక్షన్‌లోనే భారీ ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు బంధువులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు