అయోధ్యలో టీవీ చర్చలకు అనుమతి తప్పనిసరి

29 Jul, 2020 20:58 IST|Sakshi

అయోధ్య: అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ యంత్రాంగం టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. అయోధ్య నుంచి ప్రసారం చేసే చర్చా కార్యక్రమాల్లో ‘మందిరం–మసీదు వివాదం’కక్షిదారులెవరూ ఉండరాదని స్పష్టం చేసింది. భూమిపూజ రోజున చానళ్లు చేపట్టే చర్చలు, ఇతర కార్యక్రమాల్లో ఏమతానికీ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండరాదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా చానళ్లు ముందుగా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవాలని కోరింది.  ఈ మేరకు అన్ని వార్తా చానళ్లకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది.

వెండి ఇటుకలను విరాళంగా ఇవ్వకండి
వెండి లేదా ఇతర లోహాలతో తయారు చేసిన ఇటుకలను ఆలయానికి విరాళంగా ఇవ్వవద్దని రామాలయ ట్రస్టు కోరింది. భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు ఇప్పటికే ఒక క్వింటాల్‌ వెండి, ఇతర లోహాలతో తయారైన ఇటుకలను బహూకరించారని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిని ఆలయంలో భద్ర పరచడానికి గానీ, ఈ ఇటుకల్లో స్వచ్ఛతను పరీక్షించడానికి గానీ తమ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో విరాళాలను ఆలయ బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. (అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్‌‌ పన్నాగం!)

మరిన్ని వార్తలు