అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం

31 Jul, 2020 14:14 IST|Sakshi

లక్నో (ఉత్తర ప్రదేశ్‌): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్‌ ఇచ్చినట్లు ట్రస్ట్‌ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్‌ దాస్‌ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్‌)

ఆగ‌స్టు 3వ తేదీన గ‌ణేశుడి పూజ‌తో కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయ‌ని ట్ర‌స్ట్ స‌భ్యుడు డాక్ట‌ర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగ‌స్టు 5వ తేదీన గ‌ర్భ‌గుడిలో జ‌రిగే పూజ కోసం 11 మంది పండితులు వేద‌మంత్రాలు చ‌ద‌వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ చేత భూమిపూజ చేప‌ట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్‌ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా)

మరిన్ని వార్తలు