మరోసారి తెరపైకి అయోధ్య కేసు

9 Jan, 2021 10:43 IST|Sakshi

సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

నిందితులుగా అద్వానీ, బీజేపీ అగ్రనేతలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్‌ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్‌ బీజేపీ సీనియర్‌ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు  ఎదుర్కొంటున్న సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ (92), మురళీ మనోహార్‌ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్‌ సింగ్‌, వీహెచ్‌పీ నేత వినయ్‌ కటియార్‌లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్‌ అహ్మద్‌ (74), సయ్యద్‌ అల్కఖ్‌ అహ్మద్‌ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్‌ హైకోర్టు ముందు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్‌లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం)

కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్‌ నేత దివంగత అశోక్‌సింఘాల్‌  ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్‌లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!)

ఒరిజినల్‌ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్‌ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్‌ గొగోయ్‌‌ తీర్పులో పేర్కొన్నారు. 

ఆ 32 మంది వీరే..
1, ఎల్‌కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్‌ జోషి, 3. కళ్యాణ్‌ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్‌ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్, 9. రామ్‌విలాస్‌ వేదాంతి, 10. చంపత్‌ రాయ్, 11. సతీష్‌ ప్రధాన్, 12. ధరమ్‌ దాస్, 13. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్, 14. పవన్‌ కుమార్‌ పాండే, 15. జై భగవాన్‌ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్‌ సింగ్‌ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్‌ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్‌ గుర్జార్, 22. ఆర్‌ఎం శ్రీవాస్తవ, 23. సతీష్‌ ప్రధాన్‌

కరసేవకులు: 24. రామ్‌ చంద్ర ఖత్రి, 25. సుధీర్‌ కక్కర్, 26. అమన్‌ నాథ్‌ గోయల్, 27. సంతోష్‌ దుబే, 28. వినయ్‌ కుమార్‌ రాయ్, 29. కమలేష్‌ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్‌ బహదూర్‌ సింగ్, 32. నవీన్‌ భాయ్‌ శుక్లా.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు