అయోధ్యలో హైఅలర్ట్‌

30 Jul, 2020 06:00 IST|Sakshi

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చేరవేశాయి. అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్‌ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్‌లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు