సీఎం యోగి ఆదేశాలు.. ఎట్టకేలకు వీడిన ప్రభుత్వ టీచర్‌ మర్డర్‌ మిస్టరీ

4 Jul, 2022 18:52 IST|Sakshi

లక్నో: అవును.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశాలతోనే ఆ మర్డర్‌ కేసులో మిస్టరీ వీడింది. అయోధ్య పర్యటనలో ఉండగా స్థానికంగా ఓ గర్భిణి హత్య గురించి విని ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా.. విమర్శల నడుమే ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆ కేసు చిక్కుముడి విప్పారు. 

అయోధ్య కోట్‌వాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో జూన్‌ 1వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుప్రియా వర్మ(35) దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఎవరో ఆమె వీపుభాగంలో పొడిచి చంపి.. దొపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. పైగా ఆమె ఐదు నెలల గర్భవతి. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. ఆదేరోజు అయోధ్య పర్యటనలో ఉన్న సీఎం యోగికి విషయం తెలిసింది. వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్‌ డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈకేసులో విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో.. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఎం యోగి ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో టీషర్టు ధరించిన ఓ యువకుడిని గుర్తించారు. ఆ కంపెనీ టీషర్టుల ఆన్‌లైన్‌ డెలివరీల మీద ఆరా తీసి.. చివరికి నిందితుడిని పట్టేశారు. 

శారీరక సంబంధమే!
అంబేద్కర్‌నగర్‌ జిల్లా పథాన్‌పూర్‌ ఎట్రావులికి చెందిన సుప్రియా వర్మ.. పోస్టింగ్‌ రిత్యా అయోధ్యలో ఉంటోంది. ఆమె భర్త ఉమేష్‌ వర్మ కూడా ప్రభుత్వ టీచరే. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న ఓ మైనర్‌తో ఆమె సంబంధం నడిపించింది. అయితే ఆమె గర్భం దాల్చడంతో భయపడ్డ మైనర్‌.. ఎలాగైనా ఆ సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ కుర్రాడు దారుణానికి తెగబడ్డాడు. 

హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు.. ఇంట్లో నుంచి యాభై వేల రూపాయల నగదును, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంవో కార్యాలయానికి అందజేసినట్లు అయోధ్య డీఐజీ ఏకే సింగ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు