కేరళలో ఏపీ శబరిమల భక్తుల వాహనం బోల్తా.. ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా

19 Nov, 2022 12:08 IST|Sakshi

ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి నుంచి బయల్దేరిన భక్తులు 

కేరళ సర్కారుతో ఎమ్మెల్యేలు నాని, అబ్బయ్యచౌదరి, కలెక్టర్‌ సంప్రదింపులు 

ఏలూరు రూరల్‌/సాక్షి, అమరావతి :  అయ్యప్ప మాలధారులతో కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ ప్రైవేటు బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. శబరిమల సమీపంలోని పతనంతిట్ట వద్ద మలుపు తిరుగుతుండగా బ్రేక్‌ ఫెయిలై లోయలో పడింది. ప్రయాణ సమయంలో బస్సులో 46 మంది ఉండగా, వారిలో 17 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్యచౌదరి, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ కేరళ ప్రభుత్వంతో, అక్కడి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. 

రెండు బస్సుల్లో ప్రయాణం..  
ఈ నెల 15న ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన 86 మంది అయ్యప్ప మాలధారులు శబరిమల యాత్రకు రెండు బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. 18న మధ్యాహ్నం శబరిమలకు చేరుకుని దర్శనానంతరం శనివారం ఉ.6.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శబరిమల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని పతనంతిట్ట వద్ద బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. దీంతో డ్రైవర్‌ బండిని అదుపుచేయలేక లోయలో పడింది. ప్రయాణికులంతా పెద్దపెట్టున హాహాకారాలు చేశారు.

సుమారు 15–20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు ఒక్కసారిగా పడటంతో ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో మాదేపల్లికి చెందిన మణికంఠ అనే బాలుడికి పక్కటెముకలు విరిగాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సంఘటన జరిగిన తరువాత అక్కడి పోలీసులు, ఇతర అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల ద్వారా కొట్టాయం మెడికల్‌ కళాశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సు 40–50 కి.మీ.ల వేగంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ప్రమాద వార్త తెలియగానే మాదేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. తమవారి క్షేమ సమాచారం కోసం బంధువులు ఎంతో ఆతృతతో ఆరా తీశారు.  

కేరళ మంత్రితో ఆళ్ల నాని వాకబు 
సమాచారం తెలియగానే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి, స్థానిక కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాదేపల్లి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆర్‌డీఓ పెంచల కిషోర్‌తో పాటు క్షతగాత్రుల కుటుంబీకులను పరామర్శించారు. బాధితులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని వివరించారు.

ఇక బ్రేక్‌ ఫెయిల్‌ అవడంవల్లే బస్సు ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు వివరించారని వారి బంధువు, మాదేపల్లికి చెందిన శ్రీనివాస్‌ ‘సాక్షి’కి చెప్పారు. తాను కూడా వారితో పాటే శబరిమలకు వెళ్లానని, వచ్చేటప్పుడు వారికంటే ముందు బయల్దేరి వచ్చేశానన్నారు. కొండ దిగువన పెద్దపెద్ద చెట్లు ఉండడంవల్ల ప్రమాద తీవ్రత తగ్గినట్లు బాధితులు చెప్పారన్నారు. అసలు తిరుగు ప్రయాణంలో బస్సు క్లచ్‌ ప్లేట్లు పాడయ్యాయని.. మరమ్మతులు చేసుకుని తిరిగి బయలుదేరిన 30 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు వారు చెప్పారన్నారు.  

క్షతగాత్రులు వీరే.. 
గాయపడిన వారిలో.. మాదేపల్లి గ్రామానికి చెందిన బత్తిన రాజశేఖర్, చల్లా సురేష్, బత్తిన రాజేష్, తరగళ్ల రాజేష్, పాశం సాయిమణికంఠ, జి.గోపి, కాకరబత్తిన వెంకటేశ్వరరావు, మారేటి దుర్గారావు, పైడిపాతి భాస్కరరావు, గండికోట శ్యామ్, పాండు, సూరినీడు శివ, ప్రసాద గోపి, మారెడ్డి చరణ్, లక్ష్మయ్యతో పాటు ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేశ్వరరావు, శ్రీను ఉన్నారు. 

సీఎం జగన్‌ ఆరా 
సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం 

మరోవైపు.. రాష్ట్రానికి చెందిన శబరిమల భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రమాద ఘటనకు దారితీసిన పరిస్థితులు, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతోపాటు గాయపడిన వారందరికీ వైద్యం, తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు.  

మరిన్ని వార్తలు