స్వతంత్ర భారతి 1973/2022

27 Jun, 2022 11:02 IST|Sakshi

టైగర్‌ ప్రాజెక్టు 

భారతదేశ జాతీయ జంతువు పులికి ఉన్న ‘అడవి ప్రభువు’ అనే బిరుదు 1960ల చివరికి వచ్చేసరికి హాస్యాస్పదంగా మారింది. వేటగాడే వేటకు గురైనట్లయింది. పులులు తిరుగాడే అటవీ ప్రాంతాలలో చెట్లను క్రమంగా నరుకుతూ రావడం, పెద్ద యెత్తున సాగిన వేటలతో 1947లో 15 వేల మేరకు ఉన్న పులుల సంఖ్య 1972 నాటికి 1827 కు పడిపోయింది. భారతదేశంలో కనిపించే పులుల రకం అంతరించే ప్రమాదం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ను ప్రారంభించి.. కార్బెట్, కజిరంగ, మదుమలై, బందీపూర్‌లతో సహా తొమ్మిది ప్రధాన జాతీయ అభయారణ్యాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. ప్రాజెక్టులో భాగంగా.. పులులు అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఇతర జంతువుల వధపై నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు లోకి తెచ్చారు. దానిని ఉల్లంఘించినవారికి జైలు శిక్షలు, పెద్ద మొత్తాలలో జరిమానాలు విధించారు. అభయారణ్యాలలో కీలక ప్రాంతాలకు రూపకల్పన చేశారు. వాటిలోకి మనుషులెవరూ అడుగు పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో 1980 నాటికి పులుల సంఖ్య రెట్టింపు అయింది. 1972లో పులుల సంఖ్య 1827. 2002లో 3642. అయితే 2018 నాటి చిట్ట చివరి లెక్కల ప్రకారం చూస్తే మాత్రం నిరుత్సాహమే. పులుల సంఖ్య ఆ మూడు వేల దగ్గరే ఆగి ఉంది! 

మరిన్ని వార్తలు