చైతన్య భారతి: సమ్మిళిత శాస్త్రజ్ఞుడు... జీవశాస్త్ర పితామహుడు

25 Jun, 2022 08:28 IST|Sakshi

వాతావరణ మార్పుల వల్ల, జీవ వైవిధ్యంలో ఏర్పడుతున్న నష్టం వల్ల ఆహార భద్రతకు ఎదురవుతున్న ముప్పును అరికట్టడానికి ఈ 96 ఏళ్ల వయసులోనూ అలుపెరుగక నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు స్వామినాథన్‌. తన తండ్రి, చిన్నతనంలో తాను కలుసుకున్న గాంధీజీ ఇద్దరూ తనకు ప్రేరణ అని ఆయన చెబుతారు. ‘‘నాలాంటి శాస్త్రవేత్తకు ప్రేరణ ఒక్కటే. అది: నా జీవితం, నా విజ్ఞానం చాలామంది ప్రజల జీవితాలను మార్చగలదన్న గ్రహింపు’’ అంటారు. ఎండనక, వాననక మన కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్త్రీ, పురుషులకు సాయం చేయడం శాస్త్రవేత్తల విధి అని తన సహజసిద్ధమైన వినయంతో అంటారు స్వామినాథన్‌.

కేరళ రాష్ట్రానికి అన్నపూర్ణ అనదగ్గ కుట్టనాడ్‌లోని ద్వీప గ్రామం మొంకోంబు స్వామినాథన్‌ పూర్వీకుల స్వస్థలం. కుట్టనాడ్‌ ప్రాంతంలో వరి విస్తారంగా పండుతుంది. కానీ, మొక్కల జన్యు నిపుణుడిగా ఆయన సాధించిన తొలి విజయం వరి పంటలో కాదు. గోధుమలో. 1966లో పంజాబ్‌లోని దేశవాళీ గోధుమలకు, మెక్సికోకి చెందిన గోధుమలను కలిపి అత్యధిక దిగుబడినిచ్చే వంగడాలను ఆయన తయారు చేశారు. ఆ రోజుల్లో ఆహార ధాన్యాల సరఫరా తక్కువై, భారీగా దిగుమతులు చేసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. ఆ నేపథ్యంలో మొంకోంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ ప్రయోగశాలలకే పరిమితమైన శాస్త్రవేత్తగా మిగిలిపోకుండా ఆహార కొరతను అధిగమించడానికి కొత్తదారులు వెదికారు.

సంప్రదాయ వ్యవసాయ శాస్త్రజ్ఞుడిలా పరిశోధనల్లో మునిగిపోలేదు. ఏదో మొక్కుబడిగా ప్రయోగాత్మక పొలాలను సందర్శించి సరిపెట్టుకోవడం కాకుండా వ్యవసాయ క్షేత్రాలలో ప్రవేశించి, రైతుల సాధకబాధకాల మీద, ఫలసాయాన్ని పెంచడం మీద దృష్టి కేంద్రీకరించారు. గోధుమ మీద ఆయన చేసిన ప్రయోగాలు ఫలప్రదం అయ్యాయి. స్వామినాథన్‌ కృషి ఫలితంగా వ్యవసాయ పరిశోధన దేశవ్యాప్తంగా యువకులకు ఆకర్షణీయమైన వ్యావృత్తిగా మారింది. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ.. గోధుమలో స్వామినాథన్‌ సాధించిన విజయాలను వరి పంటకు కూడా విస్తరింపజేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యా లయాలు స్వామినాథన్‌కు 46 డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. ఆయన కృషికి ముగ్ధురాలైన ఇందిరాగాంధీ, ఆయనను ప్రణాళికా సంఘంలో నియమించారు. 
– అయ్యర్‌ ఆర్‌.డి. ‘సైంటిస్ట్‌ అండ్‌ హ్యూమనిస్ట్‌’ పుస్తక రచయిత 

(చదవండి: లక్ష్యం ఒక్కటే దారులు వేరు)

మరిన్ని వార్తలు