భారతీయ వ్యవసాయం (1947–2022): ఉన్నచోటే అన్నదాత..

7 Jun, 2022 09:48 IST|Sakshi

ఆంగ్లేయుల దుష్ట పాలనలో 28 సార్లు క్షామం బారిన పడిన దేశాన్ని స్వాతంత్య్రానంతరం అహరహం చమటోడ్చుతూ తిండికి దిగుల్లేకుండా చేసిన అన్నదాతలకు చివరకు దక్కిందేమిటి? స్వతంత్ర భారత 75 ఏళ్ల అమృతోత్సవ వేళ దేశ పాలకులు ఎన్ని కబుర్లు చెప్పినా.. రైతుల ఆదాయ పరిస్థితి మాత్రం అట్టడుగున కునారిల్లుతూ వెక్కిరిస్తున్నది. రసాయనాల పుణ్యాన పంట భూములు సారం కోల్పోయి పిప్పిగా మారిన నేపథ్యంలో వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని మరింత కష్టతరంగా మార్చుతూ రైతులను మరింత వణికిస్తున్నాయి.

1951 నాటికి మన దేశ జనాభా 36 కోట్లు. గ్రామీణ జనాభా 29.8 కోట్లు. వీరిలో రైతులు 7 కోట్లు. రైతు కూలీలు 2 కోట్ల 73 లక్షలు. 2011 నాటికి జనాభా 121 కోట్లకు పెరిగింది. గ్రామీణ జనాభా 83.37 కోట్లు. వీరిలో రైతులు 11.88 కోట్లు. రైతు కూలీలు 14.43 కోట్లు. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువ (సుమారు 5 కోట్ల టన్నులు). వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణావకాశాలు పెంపొందించుకుంటూ హరిత విప్లవ సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపుదలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. 1951లో పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి వేగాన్నందుకుంది. ఈ క్రమంలో 60ల నుంచి 80ల వరకు తొలి దశగా భావిస్తారు. సరికొత్త ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడుల నేపథ్యంలో వ్యవసాయోత్పత్తి కూడా పుంజుకుంది. అయినా, విదేశీ ఆహార సహాయంపై ఆధారపడాల్సిన దుస్థితిలో దేశం మిగిలిపోయింది. 

60వ దశకంలో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదం ఉత్సాహపరిచింది. పాల సహకార సంఘాలకు శ్రీకారం చుట్టడంతో శ్వేత విప్లవం వచ్చింది. తదనంతర కాలాలలో ఇందిరా గాంధీ చల్లిన విత్తనాలు ‘హరిత విప్లవాని’కి ఆధారభూతాలయ్యాయి. మెక్సికో నుంచి అధికోత్పత్తినిచ్చే పొట్టి గోధుమ రకాలను దిగుమతి చేసుకొని, సాగు నీటి సదుపాయాలు కల్పించి, రసాయనిక ఎరువులు, పురుగుమందులను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. తొలిదశలో పంజాబ్, హర్యానాతోపాటు దేశంలోని ఎంపిక చేసిన కొన్ని జిల్లాలలో కూడా సాంద్ర వ్యవసాయ పద్ధతిని అమలుపరిచారు. వాటిల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. 1967లో హరిత విప్లవ సాంకేతికత అమల్లోకొచ్చిన తొలి పంట కాలంలో పెరిగిన 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాలతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వచ్చింది. ఐదేళ్లలో దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలిగింది. సాగు నీటి విస్తీర్ణం, సాగు భూమి విస్తీర్ణం, పెరిగినకొద్దీ ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది.  

హరిత విప్లవ కాంతులు
ఆహార ధాన్యాల (వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) ఉత్పత్తి 1966–67లో (సాగు విస్తీర్ణం 11.53 కోట్ల హెక్టార్లు) 7.42 కోట్ల టన్నుల నుంచి 1985–86 నాటికి (సాగు విస్తీర్ణం 12.80 కోట్ల హెక్టార్లు) 15.04 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ కాలంలో ఆహారోత్పత్తుల దిగుబడి హెక్టారుకు 644 కిలోల నుంచి 1,175 కిలోలకు పెరిగింది. అదేవిధంగా.. 2020–21 నాటికి (సాగు విస్తీర్ణం 12.93 కోట్ల హెక్టార్లు) ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.86 కోట్ల టన్నులకు పెరిగింది. హెక్టారుకు దిగుబడి 2,386 కిలోలకు పెరిగింది. నీటిపారుదల సదుపాయం కలిగిన సాగు భూమి విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. 1950–51లో 18% భూములకు సాగు నీటి సదుపాయం ఉండగా, 1986–87 నాటికి 32%కి, 2018–19 నాటికి 54%కి పెరిగింది. 

వ్యవసాయ సంక్షోభం 
హరిత విప్లవం నేపథ్యంలో భారత్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అద్భుత విజయాలే సాధించినప్పటికీ.. ఇతరత్రా అనేక ముఖ్య విషయాల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సాంద్ర రసాయనిక వ్యవసాయ పద్ధతులు పర్యావరణ పరమైన సంక్షోభాన్ని సృష్టించాయి. మట్టిలో సేంద్రియ కర్బనం (0.2–0.4%కి) తగ్గిపోయింది. భూసారం అడుగంటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోయింది. 1970లో కేజీ రసాయనిక ఎరువులు వేస్తే 13.4 కేజీల ఆహార ధాన్యం ఉత్పత్తి›అయ్యేది. 2005 నాటికి ఇది 3.7 కిలోలకు.. 2011 నాటికి 2.4 కేజీలకు తగ్గిపోయింది. వీటికి తోడు.. ఆహారంలో రసాయనిక అవశేషాల వల్ల ప్రజారోగ్యం దెబ్బతిని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అన్నిటికీ మించి, ఉపకరణాలన్నిటినీ చిల్లర ధరకు మార్కెట్‌లో కొనుక్కొని పంటలు పండించే రైతులు టోకు ధరలకు పంట దిగుబడులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్కెట్‌ శక్తుల మాయాజాలం దెబ్బకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఏతా వాతా తేలిందేమంటే.. దేశం ఆకలి తీరినా రైతు డొక్కలు ఎండిపోయాయి. 

నెల ఆదాయం రూ. 8,059
మన దేశంలో రైతుల్లో 80–90% వరకు చిన్న, సన్నకారు రైతులే. అరెకరం నుంచి ఐదెకరాల లోపు సాగు భూమి కలిగి ఉన్న వారు. 2015–16 నాటికి దేశంలో రైతు కుటుంబం సగటు నెల ఆదాయం రూ. 8,059. అంటే.. ఏడాదికి రూ. 97 వేలు. దీన్ని ఏడేళ్లలో (2022 భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల నాటికి) రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, ఆరేళ్లు గడచిపోయినా రైతుల ఆదాయం 30%కి మించి పెరగలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

వ్యవసాయం ద్వారా కన్నా వ్యవసాయేతర పనుల ద్వారా చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది వర్షాధార సేద్యంపై ఆధారపడినవారే. జాతీయ గణాంక నివేదిక 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం, దేశంలో 57 శాతం రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా వ్యవసాయ యంత్రాలను కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తేవాలి. సంస్థాగత రుణాలు అవసరం మేరకు అందించి ఆదుకోవాలి.  పంటల సాగుతో పాటు పాడి పశువుల పెంపకం, కోళ్లు, గొర్రెలు, మేకలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ వ్యాపకాలపై రైతులు ఎక్కువగా ఆధారపడేలా ప్రభుత్వం దోహదం చెయ్యాలి.

ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన అన్ని సేవలనూ అందించేందుకు దోహదం చేయాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నంత వేగంగా కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచటం లేదు. వరి, గోధుమ, పత్తి వంటి కొన్ని పంటలను మాత్రమే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరించి చేతులు దులుపుకుంటున్నది. పంట ఏదైనా సరే మార్కెట్‌ ధర పతనం అవుతున్నప్పుడు కనీసం 25% పంటను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించాలి. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగానైనా పాలకులు చిత్తశుద్ధితో వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి కదలాలి.    
– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు
prambabu.35@gmail.com
 

మరిన్ని వార్తలు