చైతన్య భారతి: లోకమాన్యుడు బాల గంగాధర తిలక్‌ 1856–1920

6 Jun, 2022 13:13 IST|Sakshi

బాల గంగాధర తిలక్‌ / 1856–1920

సాంప్రదాయిక జాతీయవాదాన్ని స్వాతంత్య్రోద్యమంగా మలిచే ప్రయత్నం చేశారు బాల గంగాధర తిలక్‌. 1893లో ఆయన వినాయక చతుర్థి ఉత్సవాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఇందుకొక ఉదాహరణ. ఈ మహారాష్ట్ర యోధుడికి గాంధీ మార్గం పట్ల కొన్ని అభ్యంతరాలు ఉండేవి. 1920లో తిలక్‌ చనిపోయినప్పుడు బొంబాయిలో ఆయన అంత్యక్రియలకు హాజరైన 2 లక్షల మందిలో గాంధీ కూడా ఉన్నారు. ‘తిలక్‌ ఆధునిక భారత నిర్మాత’ అని గాంధీ వర్ణించారు. బాల గంగాధర తిలక్‌ అసమాన జనాకర్షణ కలిగిన శక్తిమంతమైన రాజకీయవేత్త. బ్రిటిష్‌ పాలనపై తిలక్‌ తీవ్రమైన విమర్శలు గుప్పించేవారు. వారి విధానాలను వ్యతిరేకించడంలో సమర్థమైన పాత్ర పోషించేవారు. అందుకు ఆయనను ‘లోకమాన్య’ అని గౌరవంగా పిలిచేవారు.

ఒక పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడైన తిలక్‌ కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. బాల్యంలోనే ఆయన స్వతంత్ర వైఖరి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పుణెలోని దక్కన్‌ కాలేజీలో చేరి గణితశాస్త్రంలో అమోఘమైన ప్రావీణ్యం సంపాదించారు. కాలేజీలో చదువుకుంటూనే ఆయన దేహదార్ఢ్యం పెంచుకోవడం కోసం జిమ్నాస్టిక్స్, కుస్తీ, ఈతలతో పాటు పడవ నడపడం వంటి కసరత్తులు చేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పుణెలో కొంతకాలం గణిత శాస్త్ర బోధకుడిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన జాతీయవాదాన్ని బోధించే విద్యా సంస్థల్లో చేరారు. 1880ల తొలినాళ్లలో ఆయన జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ‘మరాఠా’ అనే ఇంగ్లిషు పత్రికను, ‘కేసరి’ అనే మరాఠీ భాషా పత్రికను ప్రారంభించారు.

ఆయన అందులో రాసే వ్యాసాలు ఎంతో హేతుబద్ధంగా, ముక్కుసూటిగా ఉండేవి. కాంగ్రెస్‌ పార్టీలో మితవాదులు, అతివాదుల మధ్య చీలిక మొదలైంది ఆ దశాబ్దంలోనే. పాశ్చాత్య విద్యను అభ్యసించిన భారతీయులతో అధికారాన్ని పంచుకోవాలని మితవాదులు బ్రిటిష్‌ వారిని కోరే ప్రయత్నం చేశారు. మితవాదుల యాచక వైఖరిని వ్యతిరేకించిన కూటమి పట్ల ఆకర్షితులైన తిలక్‌ ఆ కూటమికి నాయకుడిగా మారారు. స్వరాజ్యమే నా ధ్యేయమని ఆయన నిక్కచ్చిగా నినదించారు. 
– రిచర్డ్‌ క్యాష్‌మన్, 
‘ది మిత్‌ ఆఫ్‌ ది లోకమాన్య : తిలక్, మాస్‌ పాలిటిక్స్‌ ఇన్‌ మహారాష్ట్ర’ గ్రంథ రచయిత

మరిన్ని వార్తలు