మహోజ్వల భారతి: వైద్యుడు, యోధుడు

1 Jul, 2022 11:21 IST|Sakshi

నేడు బిధాన్‌  జయంతి, వర్ధంతి కూడా. 

1882 జూలై 1న జన్మించిన బిధాన్‌ 80 ఏళ్ల వయసులో 1962 జూలై 1న కన్నుమూశారు. ఈయన జయంతిని భారత్‌ ‘జాతీయ వైద్యుల దినోత్సవం’గా పాటిస్తోంది.

బిధాన్‌ చంద్ర రాయ్‌ (బి.సి. రాయ్‌)  పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా చేశారు. వృత్తిరీత్యా వైద్యులు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. జాదవ్‌ పూర్‌ టి.బి.హాస్పిటల్, ఆర్‌.జి.ఖార్‌ మెడికల్‌ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్‌స్టిట్యూట్, చిత్తరంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ మొదలైనవి ఈయన స్థాపించిన వైద్యాలయాలే. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్‌ సేవాసదన్‌ అనే వైద్యశాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్‌ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ప్రారంభించారు. 1925లో రాజకీయాల్లో ప్రవేశించి, బారక్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పేరొందిన సురేంద్రనాధ్‌ బెనర్జీని ఓడించారు. 1961 లో బిధాన్‌ను భారతరత్న వరించింది. 

రాజర్షి  పురుషోత్తం దాస్‌
‘‘భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలన్న కలను త్యాగం చేయడం కంటే, బ్రిటిష్‌ పరిపాలనలోనే మనం ఇంకొంత కాలం కడగండ్లు పడడం ఉత్తమం...’’ 

1947 జూన్‌  15న ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రత్యేక సమావేశాలలో ఒక గళం నుంచి అనంతమైన బాధతో, క్షోభతో, ఆవేశంతో వెలువడిన మాటలివి. ఆ గళం పురుషోత్తం దాస్‌ టాండన్‌ది. సమావేశంలో పాల్గొన్న సభ్యులలో అత్యధికులు కరతాళ ధ్వనులతో టాండన్‌  వాదనకు సంఘీభావం తెలియచేశారు. అయినప్పటికీ అనతి కాలంలోనే దేశం రెండు ముక్కలైంది. టాండన్‌ హృదయం కూడా. అంతటి దేశభక్తులు ఆయన. 

పురుషోత్తమదాస్‌కు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి రాజకీయాలలోనే ‘రాజర్షి’ అన్న గౌరవం ఉండేది. మొదట గాంధీజీయే ఆయనను అలా సగౌరవంగా సంబోధించేవారు.  టాండన్‌  అవిశ్రాంత దేశ సేవకుడు. స్వాతంత్య్ర పోరాట యోధుడు. పత్రికా రచయిత. హిందీని రాజభాషను చేయాలన్న ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. నెహ్రూతో, ఆయన సిద్ధాంతాలతో, భారతదేశంలో అమలవుతున్న లౌకికవాదం మీద ఆయనకు పేచీలు ఉన్నాయి. అయినప్పటికి 1961లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. గాంధీ అభిప్రాయాలను మనసావాచా గౌరవించారు టాండన్‌ . అహింసా సిద్ధాంతాన్ని ఎంతగానో మన్నించారు. పశువుల చర్మంతో కుట్టిన పాదరక్షలను వదిలి, రబ్బరు చెప్పులు వేసుకునేవారు. గాంధీ సిద్ధాంతంలో ఒదగడానికి  వీలుగా ఎందరో తమను తాము తగ్గించుకున్నారని అనిపిస్తుంది. అలాంటివారిలో పురుషోత్తమదాస్‌ టాండన్‌  ఒకరు. నేడు ఆయన వర్ధంతి. 1962 జూలై 1 న టాండన్‌ మరణించారు.

మరిన్ని వార్తలు